యూనివర్సిటీల్లో 526 అసిస్టెంట్  ప్రొఫెసర్ కొలువులు..డిసెంబర్ 1 నాటికి నోటిఫికేషన్

 యూనివర్సిటీల్లో  526 అసిస్టెంట్  ప్రొఫెసర్ కొలువులు..డిసెంబర్ 1 నాటికి నోటిఫికేషన్
  • ఏప్రిల్ 30 నాటికి నియామక పత్రాలు
  • 429 రెగ్యులర్, 97 బ్యాక్‌‌లాగ్ పోస్టులు 
  • ఓయూలోనే అత్యధికంగా 281 
  • డిసెంబర్ 2 నుంచి 22 వరకు దరఖాస్తులు
  • డెమో, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఏండ్లుగా ఎదురుచూస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువుల భర్తీకి ప్రభుత్వం రోడ్‌‌మ్యాప్ సిద్ధం చేసింది. మొత్తం పది  వర్సిటీల్లో 526 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌‌మెంట్ షెడ్యూల్‌‌ను ఖరారు చేసింది. దీనిలో జీవో142 ద్వారా మొదటి విడతలో మంజూరైన 429 రెగ్యులర్ పోస్టులతో పాటు, అక్టోబర్ 31 నాటికి గుర్తించిన 97 బ్యాక్‌‌లాగ్ ఖాళీలు ఉన్నాయి.

డిసెంబర్1 నాటికి అధికారికంగా రిక్రూట్‌‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసి, వచ్చే ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్‌‌మెంట్ ఆర్డర్లు అందజేసేలా కార్యాచరణను రెడీ చేశారు. అయితే, బ్యాక్ లాగ్, రెగ్యులర్ పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చినా, ఒకే షెడ్యూల్​లో రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. 

భర్తీ ప్రక్రియ సాగేదిలా.. 

 ప్రతి వర్సిటీని యూనిట్‌‌గా తీసుకుని 100-పాయింట్ల రోస్టర్, రిజర్వేషన్ల పరిశీలన పూర్తి చేసి ఈనెల 30 వరకూ ఆయా వర్సిటీల ఈసీల ఆమోదం తీసుకోనున్నారు. డిసెంబర్ 1 నాటికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసి, డిసెంబర్ 2 నుంచి 22 వరకు ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 30 వరకు దరఖాస్తుల స్క్రూటినీ చేపట్టి, ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు ప్రిలిమినరీ అర్హుల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి, 10 నాటికి తుది జాబితాను ప్రకటిస్తారు.

ఆ వెంటనే షార్ట్‌‌లిస్ట్ అయిన అభ్యర్థులకు 1:10 నిష్పత్తిలో ఫిబ్రవరి 11 నుంచి 28 వరకు ఆయా యూనివర్సిటీల్లోనే డెమో, డొమైన్ నాలెడ్జ్ అసెస్‌‌మెంట్ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారికి 1:5 నిష్పత్తిలో మార్చి1 నుంచి ఏప్రిల్ 10 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి.. ఏప్రిల్ 21 నాటికి మెరిట్ లిస్ట్, రోస్టర్ తనిఖీ పూర్తి చేస్తారు. చివరగా ఎంపికైన అభ్యర్థుల జాబితాకు ఆమోదం తెలిపి, వచ్చే ఏడాది ఏప్రిల్ 30 నాటికి అపాయింట్‌‌మెంట్ ఆర్డర్లు అందజేసేలా ప్రభుత్వం పక్కా కార్యాచరణను ఖరారు చేసింది.  

ఓయూలోనే అత్యధికంగా 281 పోస్టులు..

రాష్ట్రంలో భర్తీ చేయనున్న 526 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో అత్యధికంగా ఉస్మానియా యూనివర్సిటీలోనే 281 ఖాళీలు ఉన్నాయి. ఆ తర్వాత కాకతీయ వర్సిటీలో 58, పాలమూరు, శాతవాహన వర్సిటీల్లో 52 చొప్పున పోస్టులు ఉన్నాయి. మరోపక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ వర్సిటీల్లో మొత్తం 173 బ్యాక్‌‌లాగ్‌‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

దీనిలో 97 అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్‌‌ పోస్టులు ఉండగా, మిగిలిన 76 అసోసియేట్‌‌ ప్రొఫెసర్‌‌ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అనుమతించిన 429 రెగ్యులర్‌‌ అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్‌‌ పోస్టులతో పాటే.. ఈ బ్యాక్‌‌లాగ్‌‌ పోస్టులను కూడా ఒకేసారి భర్తీ చేసేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.